వ్యవసాయంలో విద్యుత్ ఖర్చులు, సాగునీటి కోసం ఎదురయ్యే ఇబ్బందులకు సౌరశక్తి (solar Energy) ఒక ప్రత్యామ్నాయంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రైతులకు ఇంధన భద్రత (Fuel security) కల్పించడంతో పాటు, అదనపు ఆదాయ అవకాశాలను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం PM-KUSUM (Pradhan Mantri Kisan Urja Suraksha evam Utthan Mahabhiyan) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రైతులు వ్యవసాయ పంపులను సోలార్ విద్యుత్‌తో నడిపించుకోవడమే కాకుండా, పథకంలోని నిబంధనలకు అనుగుణంగా సౌర విద్యుత్ ప్లాంట్ల (Solar Power Plants) ను ఏర్పాటు చేసి విద్యుత్ విక్రయం ద్వారా ఆదాయం పొందే అవకాశం కూడా ఉంటుంది. రైతులకు ఈ పథకం ఎలా ఉపయోగపడుతుంది? సబ్సిడీ ఎంత? దరఖాస్తు ఎలా చేసుకోవాలి? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PM KUSUM Scheme లోని 3 ముఖ్య భాగాలు
రైతుల వ్యవసాయ అవసరాలకు సౌరశక్తిని వినియోగించడాన్ని ప్రోత్సహించడమే PM-KUSUM పథకం ప్రధాన ఉద్దేశం. ఈ పథకంలో ప్రధానంగా మూడు విభాగాలు ఉన్నాయి.
– Component-A: రైతులు, రైతుల సమూహాలు, FPOలు, సహకార సంఘాలు తమ బంజరు లేదా వినియోగంలో లేని భూముల్లో 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల వరకు గ్రిడ్-కనెక్టెడ్ సోలార్ ప్లాంట్లు (Grid-Connected Solar Plants) ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను నిబంధనల ప్రకారం డిస్కమ్‌లకు విక్రయించి ఆదాయం పొందవచ్చు.
– Component-B: విద్యుత్ గ్రిడ్ సౌకర్యం లేని ప్రాంతాల్లో వ్యవసాయ అవసరాల కోసం Standalone Solar Pumps ఏర్పాటు చేసుకోవచ్చు. అర్హత ఉన్న రైతులకు ప్రభుత్వ ఆర్థిక సహాయం లభిస్తుంది.
– Component-C: ఇప్పటికే ఉన్న గ్రిడ్-కనెక్టెడ్ వ్యవసాయ పంపులను సోలరైజ్ చేసుకోవచ్చు. ఉత్పత్తి అయ్యే అదనపు విద్యుత్‌ను నిబంధనల ప్రకారం డిస్కమ్‌కు విక్రయించి రైతులు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం అధికారిక PM-KUSUM పోర్టల్‌లో రాష్ట్రాల వారీగా అమలు వివరాలు, విక్రేతల జాబితా, రేటు కార్డులు, లబ్ధిదారుల సమాచారం అందుబాటులో ఉన్నాయి.
సబ్సిడీ, ఆర్థిక సహాయం ఎంత?
PM-KUSUM పథకంలోని Component-B, Component-C కింద సోలార్ పంపులు ఏర్పాటు చేసుకునే రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. సాధారణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం 30 శాతం వరకు ఆర్థిక సహాయం అందించగా, రాష్ట్ర ప్రభుత్వం కనీసం 30 శాతం సబ్సిడీ అందించే నిబంధన ఉంది.
మిగిలిన మొత్తాన్ని రైతు భరించాల్సి ఉంటుంది. అయితే బ్యాంకు రుణ సదుపాయం (Credit Facility) అందుబాటులో ఉంటే, రైతు మొత్తం ఖర్చును ఒకేసారి చెల్లించాల్సిన అవసరం ఉండదు. అటువంటి సందర్భంలో రైతు ముందుగా 10 శాతం వరకు తన వాటాను చెల్లించి, మిగిలిన మొత్తంలో 30 శాతం వరకు బ్యాంకు రుణంగా పొందే అవకాశం ఉంటుంది.
ఈశాన్య రాష్ట్రాలు, సిక్కిం, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లక్షద్వీప్, అండమాన్-నికోబార్ వంటి ప్రత్యేక ప్రాంతాల్లో కేంద్ర ఆర్థిక సహాయం 50 శాతం వరకు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీసం 30 శాతం సబ్సిడీ (Subsidy) అందించే విధానం ఉంది.
ముఖ్యంగా: రైతు చెల్లించాల్సిన తుది మొత్తం రాష్ట్ర సబ్సిడీ, పంపు ధర, బెంచ్‌మార్క్/టెండర్ ధర, బ్యాంకు రుణం వంటి అంశాలపై ఆధారపడి మారవచ్చు. కాబట్టి ప్రతి రైతుకూ కచ్చితంగా 10 శాతం మాత్రమే ఖర్చవుతుందని భావించకుండా, దరఖాస్తు సమయంలో అధికారికంగా ప్రకటించిన వివరాలను పరిశీలించాలి.
అర్హతలు, ప్రయోజనాలు
PM-KUSUM పథకం కింద వ్యక్తిగత రైతులు (Individual Farmers), రైతుల సమూహాలు (Farmers’ Groups), FPOలు, సహకార సంఘాలు (Co-Operative Societies), పంచాయతీలు (Panchayats) తదితరులకు నిబంధనల ప్రకారం ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.
- పగటిపూట సోలార్ విద్యుత్: సోలార్ పంపుల ద్వారా సాగునీటికి పగటి సమయంలో విద్యుత్ అందుబాటులో ఉంటుంది.
- అదనపు ఆదాయం: అవసరానికి మించి ఉత్పత్తి (Product) అయ్యే విద్యుత్‌ను అమలులో ఉన్న నిబంధనల ప్రకారం డిస్కమ్‌కు విక్రయించి (Sell) అదనపు ఆదాయం పొందవచ్చు.
- ఇంధన ఖర్చు తగ్గింపు: డీజిల్ పంపుల వినియోగం తగ్గడంతో ఇంధన వ్యయం కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
- దీర్ఘకాలిక ప్రయోజనం: సౌరశక్తిని వినియోగించడం వల్ల వ్యవసాయంలో సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుంది.
గమనిక: అర్హతలు, విద్యుత్ కొనుగోలు ధర, లబ్ధి వంటి వివరాలు రాష్ట్రం మరియు PM-KUSUMలోని సంబంధిత Component నిబంధనలపై ఆధారపడి ఉంటాయి.
దరఖాస్తు చేసుకునే విధానం
PM-KUSUM పథకం అమలు విధానం రాష్ట్రాన్ని బట్టి మారుతుంది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన నోడల్ ఏజెన్సీ లేదా సంబంధిత శాఖ (Nodal Agency or Concerned Department) ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. (ఉదాహరణకు తెలంగాణలో TSREDCO, ఆంధ్రప్రదేశ్‌లో NREDCAP) ద్వారా అమలు చేయబడుతుంది.)
- ముందుగా PM-KUSUM అధికారిక పోర్టల్ లేదా మీ రాష్ట్రానికి సంబంధించిన నోడల్ ఏజెన్సీ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- మీ రాష్ట్రంలో ప్రస్తుతం దరఖాస్తులు ప్రారంభమయ్యాయా, ఏ Component కింద అవకాశం ఉందో తెలుసుకోవాలి.
- రాష్ట్రం సూచించిన ఆన్లైన్ విధానం లేదా సంబంధిత కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- సాధారణంగా ఆధార్ కార్డు, భూమికి సంబంధించిన పత్రాలు/పట్టాదారు పాస్‌బుక్, బ్యాంక్ ఖాతా వివరాలు, మొబైల్ నంబర్ వంటి పత్రాలు అవసరం కావచ్చు.
- దరఖాస్తు సమర్పించిన తర్వాత అధికారులు అర్హతను పరిశీలించి, తదుపరి ప్రక్రియను కొనసాగిస్తారు.
గమనిక: అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానం రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు. కాబట్టి దరఖాస్తు చేసే ముందు సంబంధిత రాష్ట్ర అధికారిక నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా పరిశీలించండి.
ముఖ్యమైన హెచ్చరిక.. నకిలీ వెబ్సైట్లకు దూరంగా ఉండండి
PM-KUSUM పేరుతో నకిలీ వెబ్సైట్లు, మొబైల్ యాప్‌లు రైతుల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు లేదా పంపు ధర పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. కాబట్టి సోషల్ మీడియాలో కనిపించే గుర్తుతెలియని లింకుల ద్వారా దరఖాస్తు చేయడం లేదా ముందుగానే డబ్బులు చెల్లించడం చేయకండి. PM-KUSUM అధికారిక పోర్టల్ లేదా మీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన అమలు సంస్థ ద్వారానే వివరాలను నిర్ధారించుకోండి.
Read Article: Agriculture Drone Subsidy Scheme: వ్యవసాయ డ్రోన్ సబ్సిడీ.. రైతులకు రూ.5 లక్షల వరకు సాయం
PM KUSUM Scheme ద్వారా రైతులకు సౌర ఆధారిత సాగునీటి సదుపాయాలను ప్రోత్సహిస్తున్నారు. అయితే సబ్సిడీ శాతం, పంపు సామర్థ్యం, ధర, రైతు వాటా, దరఖాస్తు తేదీలు వంటి అంశాలు రాష్ట్రం మరియు అమలు సంస్థ నిబంధనలపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల “అందరికీ ఒకే శాతం సబ్సిడీ” లేదా “అందరికీ ఒకే ధర” అని భావించకుండా అధికారిక సమాచారం ఆధారంగానే దరఖాస్తు చేయాలి.
గమనిక: PM-KUSUM పథకం అమలు, దరఖాస్తు అవకాశాలు రాష్ట్రాల వారీగా మారవచ్చు. దరఖాస్తు చేసే ముందు అధికారిక PM-KUSUM పోర్టల్‌లో తాజా వివరాలను పరిశీలించండి.






